Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ నిరసనల వెనుక పెద్ద స్కెచ్: బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

Konda Vishweshwar Reddy claims big sketch behind Delhi protests
Advertisement
  • ఢిల్లీ ఓటర్ల జాబితా నిరసనలపై బీజేపీ ఎంపీ కొండా సంచలన వ్యాఖ్యలు
  • భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ఎన్‌క్లేవ్‌ల సమస్యతో వివాదాన్ని ముడిపెట్టిన వైనం
  • ప్రధాని మోదీకి వ్యతిరేకంగా 'రెజీమ్ ఛేంజ్' కుట్ర జరుగుతోందని ఆరోపణ
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే గతంలో చొరబాట్లను ప్రోత్సహించారన్న ఎంపీ
  • విపక్షాల ఏకైక అజెండా ప్రధాని మోదీని ఓడించడమేనని విమర్శ
Advertisement
ఢిల్లీలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు (SIR) వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వెనుక భారీ కుట్ర దాగి ఉందని తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు భారత్-బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా నలిగిన సరిహద్దు ఎన్‌క్లేవ్‌ల సమస్యకు, ప్రస్తుత ఆందోళనలకు సంబంధం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో విపక్షాలు, కొన్ని విదేశీ శక్తులు కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ అంశంపై ఆయన విడుదల చేసిన ఒక వీడియో ప్రస్తుతం విస్తృతంగా ప్రచారంలో ఉంది. 2015కు ముందు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత విచిత్రంగా ఉండేదని విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. "బంగ్లాదేశ్‌లో భారత్‌కు చెందిన 111 ఎన్‌క్లేవ్‌లు (చిన్న భూభాగాలు), భారత్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన 51 ఎన్‌క్లేవ్‌లు ఉండేవి. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు సరైన గుర్తింపు, పౌరసత్వం, ప్రభుత్వ సేవలు అందేవి కావు" అని ఆయన గుర్తుచేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 2015లో చారిత్రక భూ సరిహద్దు ఒప్పందం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిందని తెలిపారు.

అలాంటి అసంబద్ధమైన సరిహద్దుల వల్ల అక్రమ వలసలు పెరిగిపోయాయని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలు దీనిని ప్రోత్సహించాయని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, అసోంలో కాంగ్రెస్ పార్టీలు ఈ వలసలను ప్రోత్సహించాయని, దాని ప్రభావం హైదరాబాద్, ఢిల్లీ, బీహార్, ఒడిశా వరకు పాకిందని అన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తుంటే, అదే శక్తులు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.

"విపక్షాలకు నీట్, యూపీఐ, ఎన్నికల సంఘం వంటి అంశాలపై ఉమ్మడి అభిప్రాయం లేదు. వారి ఏకైక ఉమ్మడి లక్ష్యం ప్రధాని మోదీని ఓడించడం, అధికార మార్పు తీసుకురావడం" అని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక నేతకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కసారిగా లక్షలాది ఫాలోవర్లు పెరగడం నూటికి నూరు శాతం నకిలీ అని, డబ్బుతో సృష్టించినవేనని ఆయన ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కరెన్సీ, చమురు వాణిజ్యం, ఐటీ, ఫార్మా రంగాలపై కూడా ఒత్తిడి తెస్తున్నారని, ప్రధాని మోదీ బలమైన నాయకత్వం వల్లే దేశం నిలదొక్కుకోగలుగుతోందని ఆయన అన్నారు.
Advertisement
Advertisement
Konda Vishweshwar Reddy
Delhi Protests
India Bangladesh Border
BJP Telangana

More Telugu News